మండలంలోని అన్ని గ్రామాల్లో జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాల ఏర్పాట్లపై చర్చించేందుకు మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శంకర్ నాయక్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వివిధ శాఖల సమన్వయంపై సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తరిగొప్పుల ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి తహసీల్దార్ (ఎంఆర్ఓ), పోలీస్ సబ్ఇన్స్పెక్టర్, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, పంచాయతీరాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఇరిగేషన్ ఏఈ, ఎంపీఓ, అన్ని గ్రామపంచాయతీల కార్యదర్శులు, ఇతర సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు.
వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, ఆయా శాఖలు తమ పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. సమావేశం అత్యవసరమైనందున అధికారులు ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆయన కోరారు.











