మండలంలోని మచ్చుపహార్ గ్రామ శివారు పరిధిలో ఉన్న నాయిని గుట్టపై వెలసిన శ్రీ నాయిని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీనాయిని వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన నిర్వహించే ఈ కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
వేద పండితుడు ప్రయాగ నాగభూషణశర్మ శుభ ముహుర్తాన స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
కల్యాణ మహోత్సవం అనంతరం, సోమవారం క్షేత్రపాలకుడైన శ్రీ అంజనేయ స్వామికి చంద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉమ్మడి మచ్చుపహాడ్ గ్రామస్తులు సామూహిక వనభోజనాలకు గుట్ట ప్రాంతానికి చేరుకుని పండుగ వాతావరణాన్ని సృష్టించనున్నారు.
వనభోజనాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సర్పంచ్ లింగాల హైమా రమేష్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.








