హనుమకొండ, 2026-11-24
ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం, ఆపై భౌతిక దాడులకు దారితీసిన వాతావరణం
జన చైతన్య సభ అనంతరం హనుమకొండలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల శ్రేణులు భౌతిక దాడులకు దిగే పరిస్థితి నెలకొంది. కేటీఆర్ చేసిన విమర్శలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అదే రోజు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ, నాయిని రాజేందర్ రెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీకి రావాలని, తన స్థాయికి తాను ఎక్కువ కాబట్టి పార్టీలో ఎవరినైనా నిలబెట్టి గెలిపిస్తానని సవాల్ విసిరారు. ఈ సవాళ్లు ఇలాగే కొనసాగుతుండగా, మంగళవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. వినయ్ భాస్కర్ విసిరిన సవాలకు నాయిని రాజేందర్ రెడ్డి పారిపోయారని, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీకి రావాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల నిరసన కొనసాగుతుండగానే అక్కడికి కాంగ్రెస్ శ్రేణులు హుటాహుటిన చేరుకోవడంతో పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులను పార్టీ కార్యాలయం లోపలికి పంపించి కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.
ఇరువర్గాలను అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేసి, కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకుని, బీఆర్ఎస్ శ్రేణులు హనుమకొండ చౌరస్తాలో చర్చకు రావాలని కోరుతూ అక్కడి నుంచి చౌరస్తా వైపు బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏది ఏమైనా, జన చైతన్య సభ అనంతరం హనుమకొండలో రాజకీయాలు వేడెక్కాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో పాటు భౌతిక దాడులకు దిగే పరిస్థితికి చేరుకుంది.


