జనగామ, 2026-11-22
విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఆదివారం కలెక్టర్ కప్2026 జిల్లా స్థాయి ఇండోర్ గేమ్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. వివిధ పాఠశాలల విద్యార్థుల మార్చ్‌పాస్ట్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి విద్యార్థికి క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించడమే కలెక్టర్ కప్ లక్ష్యమని తెలిపారు. చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, యోగాసనాల ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ, శారీరక, మానసిక దృఢత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రతిరోజూ ఆటలకు ప్రోత్సహించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. డీసీపీ రాజ మహేంద్ర నాయక్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్న విద్యార్థులను క్రీడల వైపు మళ్లించాలని అన్నారు. క్రీడలతో నాయకత్వ లక్షణాలు, సమయస్ఫూర్తి, క్రమశిక్షణ అలవడతాయని, ప్రతిభ కనబరిచిన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
అనంతరం కలెక్టర్, డీసీపీ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ ఆడి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. విద్యార్థుల క్రీడా ప్రదర్శనలు, యోగాసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, డీవైఎస్ఓ నరసింహారావు, క్రీడా సమాఖ్య కార్యదర్శి గోర్ సింగ్, జీసీడీఓ గౌసియా బేగం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



