అక్బర్పేట (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 17
సిద్దిపేట పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి రూ. 350 కోట్లు కేటాయించాలని, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను ఆదుకోవాలని బీఎల్ఎఫ్ చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు విజ్ఞప్తి చేశారు. చేనేత, పద్మశాలి కార్మికులకు ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయాలని కోరారు.
సిద్దిపేట పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిద్దిపేటతో పాటు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 350 కోట్లు కేటాయించాలని బీఎల్ఎఫ్ చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు కోరారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దుబ్బాక చేనేత, పద్మశాలి కార్మికులకు ప్రత్యేక సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఎల్ఎఫ్ చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, పలు రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం పాకులాడుతున్నారే తప్ప అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని బీఎల్ఎఫ్ (బహుజన లిబరల్ ఫ్రంట్) చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు.
దుబ్బాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎస్పీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మాచవరం వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. దుబ్బాక చేనేత అద్భుత కళలకు నిలువెత్తు నిదర్శనమని, కావున దుబ్బాక నియోజకవర్గ పరిధిలో పనిచేసే చేనేత, పద్మశాలి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ. 50 కోట్లు కేటాయించాలని కోరారు. దుబ్బాక మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు రూ. 80 కోట్లు, నూతనంగా ఏర్పాటు చేసిన భుంపల్లి, మండలాలలోని రాయపోల్, నర్సింగ్ గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షల చొప్పున రూ. 65 కోట్లు, మిర్దొడ్డి, చేగుంట మండలాలకు రూ. 10 కోట్ల చొప్పున రెండు మండలాలకు కలిపి రూ. 20 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై అధికారులు దుబ్బాక నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించాలని కోరారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఏర్పాటుతో తమ గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని, తమ బ్రతుకులను అంధకారంలోకి నెట్టివేసిన మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి, వారికి తగిన పరిహారంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని బీఎల్ఎఫ్ చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు కోరారు.
రైతులకు సాగునీరు, విద్యుత్, గిట్టుబాటు ధర వంటి సంక్షేమ పథకాలతో పాటు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సాన తిరుపతి, గుండా శ్రీనివాస్, మల్లేశం, వెంకటేశం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


