నిర్మల్, 10 November
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జాదవ్ సంతోష్ పై కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ
జిల్లా భైంసా మున్సిపాలిటీలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జాదవ్ సంతోష్ రూ.50 వేల లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడు చేపట్టిన సివిల్ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.2,63,128 బిల్లును విడుదల చేసేందుకు జాదవ్ సంతోష్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. గతంలో రూ.10 వేల లంచం తీసుకుని రూ.6.40 లక్షల చెక్కును విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన బిల్లు చెల్లింపునకు, చెక్కు జారీ చేసేందుకు మరో రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లంచం సొమ్ము స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి కారులోని డ్యాష్‌బోర్డు నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షల్లో డ్యాష్‌బోర్డు స్వాబ్ నమూనాలు పాజిటివ్‌గా వచ్చినట్లు ఏసీబీ వెల్లడించింది.
అధికారిక హోదాను దుర్వినియోగం చేసి అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు గుర్తించిన అధికారులు, నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సూచించారు.

