ఇతరుల గుర్తింపు వివరాలను ఉపయోగించి అనుమతి లేకుండా సిమ్ కార్డులను యాక్టివేట్ చేయడం, వాటిని విక్రయించడం వంటి ఆరోపణలపై కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్ కార్డుల పంపిణీ, యాక్టివేషన్, వినియోగదారుల గుర్తింపు ధ్రువీకరణలో భద్రతా విధానాలను సమీక్షించాలని పోలీసు సైబర్ కమాండ్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. జియో సంస్థలో ప్రమోటర్‌గా పనిచేసిన మల్లికార్జున వద్ద 75 సిమ్ కార్డులు ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు. వీటిలో 55 జియో సిమ్ కార్డులు, 20 వొడాఫోన్ సిమ్ కార్డులు ఉన్నాయని, అవి వేర్వేరు వ్యక్తుల పేర్లతో ముందుగా యాక్టివేట్ అయ్యాయని ప్రాసిక్యూషన్ పేర్కొంది. సిమ్ కార్డులు కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారుల ఆధార్ వివరాలు, ఫొటోలను సేకరించి, వాటిని అనధికారికంగా యాక్టివేషన్‌కు ఉపయోగించారనేది పోలీసుల ఆరోపణ. అయితే తాను సిమ్ కార్డులను యాక్టివేట్ చేయలేదని, జియో సిమ్ కార్డులను విక్రయించేందుకు మాత్రమే తనకు అప్పగించారని పిటిషనర్ వాదించారు.
సైబర్ నేరాలకు దుర్వినియోగం
సిమ్ కార్డులు కేవలం ఫోన్ సేవలకే పరిమితం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. వాటి ద్వారా ఒకసారి ఉపయోగించే సంకేతాలు (ఓటీపీలు) స్వీకరించడం, ఆన్లైన్ ఖాతాలు నమోదు చేయడం, ఆర్థిక సేవలను పొందడం వంటి పనులు జరుగుతాయని పేర్కొంది. ఇతరుల పేర్లతో, వారి అనుమతి లేకుండా సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి వినియోగిస్తే, గుర్తింపు వివరాల దుర్వినియోగం, ఆర్థిక మోసాలు, ఇతర సైబర్ నేరాలకు అవకాశం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
పంపిణీపై పర్యవేక్షణ పెంచాలి
సిమ్ కార్డుల నిల్వ, పంపిణీ, విక్రయం, తిరిగి అప్పగింపు, రద్దు వంటి వివరాలను సక్రమంగా నమోదు చేసే విధానాలను సమీక్షించాలని న్యాయస్థానం సూచించింది. వినియోగదారుల గుర్తింపు ధ్రువీకరణ తర్వాతే సిమ్ కార్డులు యాక్టివేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఒకే పంపిణీదారుడు లేదా విక్రయ కేంద్రం నుంచి అసాధారణంగా ఎక్కువ సిమ్ కార్డులు యాక్టివేట్ అవుతున్నాయా అనే అంశాన్ని గుర్తించే విధానాలను పరిశీలించాలని ఆదేశించింది.
తమ పేర్లతో అనుమతి లేకుండా సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు అనుమానం ఉన్నవారు ఫిర్యాదు చేయడానికి సులభమైన వ్యవస్థ ఉండాలని కూడా సూచించింది. ఫిర్యాదులను పరిశీలించి, నిర్ధారణ అయిన సందర్భాల్లో తప్పు వివరాలను సరిచేసి, మరింత దుర్వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
వ్యక్తిగత సమాచార గోప్యత
ఈ చర్యల పేరుతో ప్రజలపై విచక్షణారహిత నిఘా పెట్టడానికి, చట్టవిరుద్ధంగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి లేదా ఇతరులకు వెల్లడించడానికి అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అన్ని చర్యలు వర్తించే చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే ఉండాలని తెలిపింది.
ఈ కేసులో ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలను తేల్చేందుకు మౌఖిక, పత్రాధార సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అందువల్ల క్రిమినల్ కేసును ప్రాథమిక దశలోనే కొట్టివేయడానికి నిరాకరించింది. అయితే పిటిషనర్ నేరం చేసినట్లు తుది నిర్ణయం తీసుకోలేదని, ఆయన దోషినా కాదా అనేది విచారణలో తేలాల్సి ఉందని స్పష్టం చేసింది.











