తరిగొప్పుల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐదో విడత సామాజిక తనిఖీ గ్రామసభను సోమవారం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పనుల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులపై సమగ్రంగా సమీక్షించారు. గ్రామ సర్పంచ్ అర్జుల జ్యోతి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివరాలను ప్రజల సమక్షంలో వెల్లడించారు.
గ్రామంలో చేపట్టిన పనుల వివరాలు, కూలీలకు కల్పించిన పనిదినాలు, హాజరు నమోదు, కూలీ చెల్లింపులు, పనుల నాణ్యత, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను సామాజిక తనిఖీ బృందం పరిశీలించింది. పథకం నిబంధనల మేరకు పనులు జరిగాయా, కూలీలకు వేతనాలు సక్రమంగా అందాయా అనే అంశాలను రికార్డులతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోల్చి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అర్జుల జ్యోతి రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని కూలీ కుటుంబాలకు ఉపాధి కల్పించడంతోపాటు, గ్రామ అవసరాలకు ఉపయోగపడే పనులను చేపట్టడమే లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పనుల ఎంపిక, ఆమోదం, అమలు ప్రక్రియలో నిబంధనలు పాటిస్తూ పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పనిదినాలు కల్పించడంతోపాటు, గ్రామాభివృద్ధికి అవసరమైన ఆస్తుల నిర్మాణం జరుగుతోందని అధికారులు తెలిపారు. సామాజిక తనిఖీ గ్రామసభల ద్వారా పథకం అమలు తీరును ప్రజలు పరిశీలించే అవకాశం కలుగుతుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాంబాబు, ఈసీ లింగయ్య, అడిట్ ఆఫీసర్ సత్యనారాయణ, గ్రామ పాలకవర్గ సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.












