జనగామ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
భద్రాద్రి జిల్లా మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ జి. ప్రవళికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ ఆర్టీసీ డిపో ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. జనగామ డిపో ఈయూ సెక్రటరీ వీఎస్ఆర్ రెడ్డి, డిపో అధ్యక్షుడు ఏ. శ్రీనివాస్, డిపో చైర్మన్ జుర్రు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. మణుగూరు డిపోలో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ ప్రవళికను ఓ మహిళా ప్రయాణికురాలు బస్సు నుంచి నెట్టివేయడంతో, ఆమె కాలు బస్సు టైరు కిందపడి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్లకార్డులు మరియు గాయాలకు సంబంధించిన ఫోటోలతో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, బాధిత కండక్టర్‌కు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా, కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించి, వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఆమె పూర్తిగా కోలుకునే వరకు ఆన్‌డ్యూటీగా పరిగణించి పూర్తి జీతభత్యాలు చెల్లించాలని, ఆమెను నెట్టివేసిన మహిళపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రవళిక కోలుకున్న అనంతరం, ఇతర శాఖలో ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.












