అవార్డుకు న్యాయవాది ఎండభట్ల శ్రీహరి ఎంపిక
సామాజిక సేవే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రముఖ న్యాయవాది ఎండభట్ల శ్రీహరికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జనగామ జిల్లా మండలం పోతారం గ్రామానికి చెందిన ఆయన బహుజన సాహిత్య అకాడమీ అందించే బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ ప్రకటించారు.
చిన్నతనం నుంచి పేదరికాన్ని ఎదుర్కొంటూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన శ్రీహరి, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేశారు. న్యాయవాదిగా కొనసాగుతూనే సామాజిక బాధ్యతను విస్మరించకుండా పేదలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి చదువుకు అండగా నిలుస్తున్నారు. మహనీయుల ఆశయాలను ఆచరణలో పెడుతూ, సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నల్లా రాధాకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా ఎండభట్ల శ్రీహరి మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి జాతీయ పురస్కారానికి ఎంపిక చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉంటానని, పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడంతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. తన ఎంపికకు సహకరించిన బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నవంబరు 15న ఢిల్లీలో నిర్వహించనున్న బహుజన సాహిత్య అకాడమీ 20వ జాతీయ సదస్సులో శ్రీహరికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం పట్ల పోతారం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







