బచ్చన్నపేట్, 11 November
పోచన్నపేట గ్రామ శివారులో కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లడంతో భార్యాభర్తలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది.
మండలం పోచన్నపేట గ్రామ శివారులో బుధవారం ప్రమాదవశాత్తు ఓ కారు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. జనగామ మండలం పెద్ద రామన్‌చర్ల గ్రామానికి చెందిన కొలిపాక ప్రశాంత్ కారు నడుపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు బావిలో పడుతున్న సమయంలో అప్రమత్తమైన ప్రశాంత్ తన భార్యను కారులో నుంచి బయటకు నెట్టి ఆమె ప్రాణాలను కాపాడాడు. అయితే ప్రశాంత్ కారుతో పాటు బావిలో పడిపోయాడు.
ఈత రావడంతో బావి నుంచి బయటపడేందుకు ప్రశాంత్ ప్రయత్నిస్తుండగా, విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ ఉమేష్ చంద్ర, మరో ఇద్దరు గ్రామస్తులు వెంటనే స్పందించారు. తాడు సహాయంతో బావిలోకి దిగి ప్రశాంత్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడిన ఉప సర్పంచ్ ఉమేష్ చంద్ర, గ్రామస్తుల ధైర్యసాహసాలను పలువురు అభినందించారు.

