హుస్నాబాద్, 13 November
కోహెడ మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట తాత్కాలికంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని, క్రమంగా వాటి స్థానంలో పక్కా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.
మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట తాత్కాలికంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని, క్రమంగా వాటి స్థానంలో పక్కా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కోహెడ మండలంలో ప్రాంతాన్ని బట్టి ఎకరా భూమి ధర రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పలుకుతుండటంతో ప్రభుత్వ స్థలాలపై ఆక్రమణదారుల కన్ను పడిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే అధికారులు స్పందించడం కాకుండా, ప్రభుత్వ భూములను కాపాడేందుకు సమగ్రంగా సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
రేకుల షెడ్ల తొలగింపునకు చర్యలు
కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని కొందరు తాత్కాలిక నివాసాలు, మరికొందరు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్రమణలను గుర్తించి తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కోహెడ కొత్త బస్టాండ్ పరిసరాల్లోని సర్వే నంబర్ 1223లో ఇటీవల రేకుల షెడ్లను పాక్షికంగా తొలగించారు. అలాగే బడుగుల చెరువు పరిసరాల్లోని సర్వే నంబర్ 1227లో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన గుడిసెలు, ఇంటి నిర్మాణాలను గుర్తించి చర్యలకు సిద్ధమవుతున్నారు.
సుమారు ఎకరా విలువైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావాలనే లక్ష్యంతో అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించని వారిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సర్వే నంబర్ 1223లో కొత్త బస్టాండ్ వద్ద రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని కూరగాయలు, ఇతర సామగ్రి విక్రయిస్తూ పలువురు చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. అయితే జీవో 50 ప్రకారం అనుమతి ఉన్న రెండు ఇంటి స్థలాలను మినహాయించి మిగిలిన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.
పశువైద్య కేంద్రం ముందు దుకాణాలతో ఇబ్బందులు
మరోవైపు కోహెడ ప్రధాన రహదారిపై ఉన్న ప్రాథమిక పశువైద్య కేంద్రం ప్రహరీ గోడకు ఇరువైపులా పలువురు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పశువులను వైద్య సేవల కోసం కేంద్రంలోకి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. వాహనాలు నిలిపేందుకు కూడా సరైన స్థలం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై సమగ్ర సర్వే అవసరం
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కేవలం ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలకే పరిమితం కాకుండా మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోనూ ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలించి, ఆక్రమణలను గుర్తించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడటంతో పాటు చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.






