జనగామ, 14 November
మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, కౌన్సిలర్ బూడిద జ్యోతి క్లాప్ కొట్టి ప్రారంభించారు
జనగామ రూరల్: జనగామ ప్రాంతానికి చెందిన యువకులు రూపొందిస్తున్న నూతన సినిమా చిత్రీకరణ చీటకోడూర్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, జనగామ మున్సిపాలిటీ మూడో వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చాగంటి టింకు (జితేందర్) మాట్లాడుతూ.. 1990వ దశకంలో జనగామ ప్రాంతంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ప్రజల జీవన విధానం, అప్పటి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం సాగించిన పోరాటాలు చిత్రానికి ప్రధాన ఇతివృత్తమని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత చేసిన కృషి, కుటుంబ సంబంధాలు, త్యాగాలు, అవినీతికి వ్యతిరేకంగా అప్పటి యువకులు పోషించిన పాత్రను ఈ సినిమాలో చూపించనున్నట్లు వివరించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా కొన్ని కల్పిత అంశాలను జోడించి సినిమాను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, కౌన్సిలర్ బూడిద జ్యోతి మాట్లాడుతూ.. జనగామ ప్రాంతానికి చెందిన యువకులు సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని సినిమా నిర్మించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

