హుస్నాబాద్, 16 November
హుస్నాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచితంగా సహాయక ఉపకరణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలింకో సంస్థ సహకారంతో ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రారంభించింది. కరీంనగర్ జిల్లా మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ శిబిరాలను ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందజేయడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచితంగా సహాయక ఉపకరణాలు అందించేందుకు అలింకో సంస్థ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను కరీంనగర్ జిల్లా మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అలింకో సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దివ్యాంగులు, వృద్ధులకు అవసరమైన సహాయక పరికరాలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు.
అలింకో సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరాల ద్వారా అర్హులను గుర్తించి వారికి అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు, చేతి కర్రలు, వీల్చైర్లు, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు తదితర సహాయక ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామని వెల్లడించారు.
ప్రారంభమైన శిబిరాలు 17న ఎల్కతుర్తి, 18న భీమదేవరపల్లి, 20న కోహెడ, 21న చిగురుమామిడి మండలాల్లో నిర్వహిస్తామని తెలిపారు. 26, 27 తేదీల్లో హుస్నాబాద్ మండలంతో పాటు పట్టణంలో శిబిరాలు నిర్వహించి, అనంతరం అక్కన్నపేట మండలంలో కూడా ఈ కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో అర్హులైన ఏ ఒక్క దివ్యాంగుడు, వృద్ధుడు కూడా సహాయక ఉపకరణాలు అందకుండా మిగిలిపోకూడదన్నదే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లోని అర్హులను గుర్తించి శిబిరాలకు తీసుకురావడంతో పాటు వైద్య పరీక్షల అనంతరం తిరిగి వారి గ్రామాలకు చేర్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికే అర్హులైన వారికి ఏడు రకాల పెన్షన్లు మంజూరు చేశామని, హుస్నాబాద్ నియోజకవర్గంలో 5 వేలకుపైగా కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హత ఉండి పెన్షన్ రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
360 డిగ్రీల వెరిఫికేషన్ అనంతరం రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. పెన్షన్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగే దళారులను నమ్మవద్దని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మూడు జిల్లాల పరిధిలో నేటి నుంచే కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని, హుస్నాబాద్‌లో కూడా త్వరలో ప్రత్యేకంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.



