తరిగొప్పుల, ఓరుగల్లు, 16 November
ప్రతి గ్రామంలో ఏర్పాటుకు సర్పంచులు సహకరించాలి: పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు కీలకమని ఎస్సై చెన్నకేశవులు అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సర్పంచులు ముందుకు రావాలని ఆయన కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై చెన్నకేశవులును ఎస్టీసెల్ సర్పంచుల మండల అధ్యక్షుడు భూక్య ధనుష్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్టీ సెల్ సర్పంచుల మండల అధ్యక్షుడు భూక్య ధనుష్ నాయక్ మాట్లాడుతూ...గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సంపూర్ణ సహకారం అందిస్తారని తెలిపారు.
ఎస్సై చెన్నకేశవులు మాట్లాడుతూ... పోలీసుల విధులకు ఆటంకం కలిగించినా,శాంతిభద్రతలకు భంగం కలిగించినా ఉపేక్షించేది లేదని,బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గ్రామాల అభివృద్ధితోపాటు ప్రజల భద్రతకు సర్పంచులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు భూక్య రవి నాయక్, లావుడ్యా సుగుణ బీమా, గూగులోత్ లలిత రాజు, ఉప సర్పంచులు భూక్య మాన్సింగ్, గూగులోత్ టోల్యా, బానోత్ సుమన్, లావుడ్యా శ్రీనివాస్, జాటోత్ రాజు, అజ్మిర కిషన్ తదితరులు పాల్గొన్నారు.



