సిద్దిపేట ఏరియా ఆసుపత్రి, సిద్దిపేట, తెలంగాణ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 10
అటెండెన్స్ రిజిస్టర్లో ముందస్తు సంతకాలు, విధుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై తీవ్ర అసహనం
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి (టీచింగ్ హాస్పిటల్)లో వైద్యుల నిర్లక్ష్యం, మందుల కొరత, వైద్య సేవల్లో లోపాలపై మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన ఆయన వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. విధులకు హాజరై అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసినప్పటికీ ఆసుపత్రిలో అందుబాటులో లేని వైద్యులకు ఫోన్ చేసి పిలిపించి నిలదీశారు. ముందుగా రేడియాలజీ, ఆర్థోపెడిక్, అనస్థీషియా, బైపాస్ సర్జరీ, జనరల్ తదితర విభాగాలను పరిశీలించారు. పలువురు వైద్యులు హాజరు రిజిస్టర్లో సంతకాలు చేసినా విధుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మరుసటి రోజు తేదీకి కూడా ముందస్తుగా సంతకాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆసుపత్రిలో మొత్తం 318 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 230 మంది మాత్రమే విధుల్లో ఉన్నారని తెలిపారు. అనంతరం ఫార్మసీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, పోస్ట్ మెంటల్ వార్డు, యాంటినేటల్ వార్డు, చిన్నపిల్లల విభాగం, ఐసీయూ తదితర విభాగాలను సందర్శించారు. రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్యుల అందుబాటు, ఆసుపత్రిలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు.
వైద్య సేవలపై అసంతృప్తి
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి సిద్దిపేటకు తీసుకొచ్చిన ప్రత్యేక వైద్య విభాగాలు ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఆర్థోపెడిక్ విభాగంలో 18 మంది వైద్యులు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని, నెలకు కనీసం 60 శస్త్రచికిత్సలు కూడా జరగకపోవడం బాధాకరమని అన్నారు. పీడియాట్రిక్, సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాల్లో నీటి లీకేజీ సమస్యలు ఉన్నప్పటికీ, పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మందుల కొరత, ఆరోగ్యశ్రీ బకాయిలు
ఆసుపత్రి ఫార్మసీలో 360 రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, కేవలం 190 రకాల మందులే సరఫరా అవుతున్నాయని, మిగిలిన మందులు అందుబాటులో లేక పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రేడియాలజీ విభాగంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి సుమారు రూ.30 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.
ప్రసవాల సంఖ్య తగ్గింపు
గతంలో ఆసుపత్రిలో నెలకు సుమారు 400 ప్రసవాలు జరిగేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 320కి తగ్గిందని పేర్కొన్నారు. గైనకాలజీ విభాగంలోని సమస్యలను పరిష్కరించి గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండి బాధ్యతగా విధులు నిర్వహించాలని హరీశ్ రావు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. ఆసుపత్రిలోని లోపాలను సరిదిద్ది మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తానని, అవసరమైతే కొత్త ఆసుపత్రికి మార్చే ప్రయత్నం కూడా చేస్తానని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హరీశ్ రావు కోరారు.


