సోనిత్పూర్, 26 జూన్ 2026
దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఓ ముఠాను అస్సాం పోలీసులు గుర్తించారు. మోసాల ద్వారా వచ్చిన డబ్బును వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా తరలించేందుకు ఉపయోగించినట్లు భావిస్తున్న ఈ నెట్వర్క్కు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు పాకిస్థాన్ నిఘా సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ ప్రత్యేక దర్యాప్తు బృందం () విచారణ చేపట్టింది.
అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలతో వెలుగులోకి వచ్చిన ఈ ముఠా వ్యవహారం కేంద్ర నిఘా సంస్థలు, మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారంతో వెలుగులోకి వచ్చింది. గజరాజ్ మిలిటరీ ఇంటెలిజెన్స్, తేజ్పూర్ నుంచి అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సోనిత్పూర్ జిల్లా పోలీసులు ఫిర్యాదు చేశారు. అనంతరం అస్సాం పోలీసుల ఎస్టీఎఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
గువాహటికి చెందిన మార్జినా బేగం పేరుతో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2022 నుంచి కేవలం 47 రోజుల్లోనే ఆ ఖాతాలో లక్షల రూపాయలు జమ అయ్యాయి. డబ్బు జమ అయిన కొద్దిసేపటికే వాటిని ఉపసంహరించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ ఖాతాను మోసపూరిత లావాదేవీలకు ఉపయోగిస్తున్నారనే అనుమానం బలపడింది.
దర్యాప్తులో మార్జినా బేగంతో పాటు మోఫిజుల్ హక్ (22), హిమాంశు దాస్ (19) అనుమానాస్పద లావాదేవీల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో వీరిని అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా ముఠాతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న మరికొందరి పేర్లు బయటపడటంతో పోలీసులు తదుపరి దాడులు నిర్వహించారు. రకీబ్ హుస్సేన్ (34)ను అరెస్ట్ చేశారు. ఇఫ్తార్ హుస్సేన్ (25), అర్మాన్ అజుజ్ హోక్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. ఇలా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు అస్సాం పోలీసులు వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ ముఠా దాదాపు రెండేళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఆన్లైన్ మోసాల ద్వారా బాధితుల నుంచి సేకరించిన డబ్బును పలు మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.
మ్యూల్ బ్యాంకు ఖాతాలు అంటే ఏమిటి
ఇతరుల నుంచి వచ్చిన డబ్బును స్వీకరించి, దాన్ని మరో ఖాతాకు బదిలీ చేయడానికి లేదా నగదుగా తీసుకోవడానికి ఉపయోగించే బ్యాంకు ఖాతాలను సాధారణంగా మ్యూల్ ఖాతాలు అంటారు. కొన్ని సందర్భాల్లో ఖాతాదారులకు తమ ఖాతాలు నేర కార్యకలాపాలకు ఉపయోగపడుతున్న విషయం తెలియకపోవచ్చు, మరికొన్ని సందర్భాల్లో తెలిసే సహకరించే అవకాశం ఉంటుంది. ఈ కేసులోనూ పలు ఖాతాల ద్వారా డబ్బు తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మోసాల ద్వారా బాధితులు కోటానుకోట్ల రూపాయలు నష్టపోయి ఉండవచ్చని ప్రాథమిక అంచనా. అయితే అసలు మొత్తం ఎంతన్నది ఇంకా నిర్ధారించలేదు.
పాకిస్థాన్ నిఘా సంస్థలతో సంబంధాలపై విచారణ
ఈ ముఠా కార్యకలాపాలకు అస్సాం వెలుపల ఉన్న ఓ కీలక వ్యక్తి నాయకత్వం వహిస్తున్నట్లు ఎస్టీఎఫ్ అనుమానిస్తోంది. అతడే ఇతర సభ్యులకు బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీల నిర్వహణపై సూచనలు ఇస్తున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ నెట్వర్క్కు పాకిస్థాన్ నిఘా సంస్థలకు చెందిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయా, ఆర్థిక మోసాల వెనుక మరేదైనా దేశవ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయా అనే అంశాలపై కూడా అధికారులు విచారణ చేస్తున్నారు.











