పాలకుర్తి, 2026-11-21
గిరిజన ప్రజాప్రతినిధిపై దాడి నిరసనలో భాగంగా చేపట్టిన కార్యక్రమానికి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
పాలకుర్తి మండలం గుడికుంట తండ గ్రామానికి చెందిన గిరిజన సర్పంచ్, తెలంగాణ గిరిజన సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ మహేందర్ నాయక్‌పై జరిగిన దాడికి నిరసనగా చేపట్టిన చలో పాలకుర్తి కార్యక్రమానికి బయలుదేరుతుండగా, లంబాడ హక్కుల పోరాట సమితి జనగామ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్‌ను పోలీసులు ఇంటి వద్దే ముందస్తుగా అరెస్టు చేసి జనగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, న్యాయం కోసం శాంతియుతంగా నిరసన తెలిపే నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, అన్యాయాన్ని నిరసించడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులని, ఆ హక్కులను పోలీసు నిర్బంధాలతో అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు.
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.. అణచివేతతో గిరిజనుల గొంతును నొక్కలేరు. గిరిజనుల ఆత్మగౌరవం, ప్రజాప్రతినిధుల గౌరవం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని జిల్లా అధ్యక్షులు కొర్ర రాజేందర్ నాయక్ హెచ్చరించారు.


