తరిగొప్పుల, 19 November
సర్వే నంబర్ 276లో 1.03 ఎకరాల భూమిని కాపాడాలని బాధితుల వినతి
మండల కేంద్రంలోని దళితులకు చెందిన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యను విన్నవించారు.బస్టాండ్ ఆవరణలోని సర్వే నంబర్ 276లో ఉన్న ఒక ఎకరం మూడు గుంటల భూమిని అర్జుల మధుసూదన్ రెడ్డి అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గత 25 ఏళ్లుగా భూమి వివాదం పేరుతో కేసులు పెట్టిస్తూ,కోర్టుల చుట్టూ తిప్పుతూ దళిత కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు. మధుసూదన్ రెడ్డి తన భార్య సర్పంచ్ పదవిని అడ్డుపెట్టుకొని దళితుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని,అభివృద్ధి పేరుతో కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామంటూ భూములను అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారని వివరించారు.
దళితుల భూములపై జరుగుతున్న అక్రమ ప్రయత్నాలను అడ్డుకొని, తమ హక్కులను కాపాడాలని మందకృష్ణ మాదిగను కోరారు. బాధితుల సమస్యను విన్న మందకృష్ణ మాదిగ వెంటనే స్పందించి, వారికి న్యాయం జరిగేలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు సమాచారం అందించి, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాటెల్లి సుదర్శనం, దామెర తామస్, యాటెల్లి ఉప్పలయ్య, దామెర ఇసాక్, చింతల జైపాల్, దామెర మైఖేల్ తదితరులు పాల్గొన్నారు.



