విశాఖపట్నం, 25 సెప్టెంబర్ 2025
ఆంధ్రప్రదేశ్లో జీవనశైలి వ్యాధులైన అధిక రక్తపోటు, మధుమేహం తీవ్రత పెరుగుతోందని, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (4.0) సర్వేలో లక్షలాది మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడైంది.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 నెలల పాటు నిర్వహించిన ఈ సర్వే ముగిసింది. సర్వే ఫలితాలను కుటుంబ సంక్షేమ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్ ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ శ్యామల ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్కు అందజేశారు.
2.85 కోట్ల మందికి ఆరోగ్య పరీక్షలు
2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సర్వేను ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య కార్యకర్తలు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 ఏళ్లు పైబడిన సుమారు 2.85 కోట్ల మందికి హైబీపీ, డయాబెటిస్, నోటి క్యాన్సర్ పరీక్షలు చేశారు. మరో 1.46 కోట్ల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఇప్పటికే వ్యాధులతో బాధపడుతున్నవారితో పాటు కొత్తగా వ్యాధులు ఉన్నట్లు గుర్తించినవారి వివరాలను కూడా నమోదు చేశారు.
కొత్తగా 23.82 లక్షల వ్యాధుల గుర్తింపు
సర్వేలో కొత్తగా గుర్తించిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి: హైబీపీ 12,23,185, డయాబెటిస్ 11,58,632. రెండు వ్యాధులూ ఉన్నవారు సుమారు 34 లక్షల మంది. మొత్తం కొత్త కేసులు (హైబీపీ, డయాబెటిస్ కలిపి) సుమారు 23.82 లక్షలు. కొత్తగా గుర్తించిన కేసుల్లో 60 ఏళ్లు పైబడినవారే అధికంగా ఉన్నారు. హైబీపీ కొత్త కేసుల్లో 47.60 శాతం, డయాబెటిస్ కేసుల్లో 43.39 శాతం మంది ఈ వయసు వారే.
జిల్లాల వారీగా కేసుల వివరాలు
హైబీపీ కొత్త కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాలు: విశాఖపట్నం (78,017), పశ్చిమ గోదావరి (68,802), తిరుపతి (65,504), తూర్పు గోదావరి (64,116), వైఎస్సార్ కడప (63,141). డయాబెటిస్ కొత్త కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాలు: విశాఖపట్నం (80,692), పశ్చిమ గోదావరి (67,935), తిరుపతి (67,827), వైఎస్సార్ కడప (66,914), ప్రకాశం (61,415). ఈ వివరాల ప్రకారం కొత్తగా గుర్తించిన హైబీపీ, డయాబెటిస్ కేసుల్లో విశాఖపట్నం జిల్లా ముందున్నట్లు వెల్లడైంది.
ఈ ఆరోగ్య కార్యక్రమంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా నిర్వహించారు. పరీక్షల అనంతరం వైద్య నిర్ధారణలో నోటి క్యాన్సర్ 3,339, రొమ్ము క్యాన్సర్ 5,832, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 3,597 కేసులు గుర్తించారు. అనుమానిత కేసులను ఉన్నత స్థాయి ఆసుపత్రులకు పంపించి, వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించారు.
హైబీపీ, డయాబెటిస్ కేసుల్లో వృద్ధుల వాటా ఎక్కువగా ఉండటంతో, వయసు పెరిగే కొద్దీ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే సూచిస్తోంది. 5059 ఏళ్ల వయసు వారిలోనూ కొత్త కేసులు గణనీయంగా నమోదయ్యాయి. గుర్తించిన వ్యాధులకు ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించి చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


