కుకునూరుపల్లి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 25
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం ఎల్లాయగూడ గ్రామంలో గ్రామ సర్పంచ్ సుదర్శన్ అధ్యక్షతన బాలవికాస సంస్థ ప్రతినిధులు బుధవారం గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి, స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఎల్లాయగూడ గ్రామానికి వాటర్ ప్లాంట్ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
బాలవికాస సంస్థ లక్ష్యాలు
ఈ సందర్భంగా బాలవికాస ప్రతినిధులు మాట్లాడుతూ.. బాలవికాస సంస్థ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళా సాధికారత, పిల్లల సంక్షేమం, ఆరోగ్యం, విద్య, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నామని, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన తాగునీరు అందించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని వివరించారు. ఎల్లాయగూడ గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు చేయడం ద్వారా గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాసపాక జానీ, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు కొంతం కరుణాకర్, మాసపాక ప్రవీణ్, మాసపాక మహేశ్వరి, సున్నం కనకమ్మ, గ్రామ పెద్దలు, మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామసభను విజయవంతం చేశారు.


