హుస్నాబాద్, 2026-11-23
తెలంగాణ తొలి సమాజ తత్వకవి, హేతువాద వేదాంత కవి అయిన సిద్ధప్ప వరకవి రాజయోగి గురుపూజోత్సవం మంగళవారం గుండారెడ్డిపల్లి గ్రామంలోని సిద్ధప్ప ఆశ్రమంలో నిర్వహిస్తున్నట్లు సిద్ధప్ప కళాపీఠం ప్రతినిధి అనంతవరం మాణిక్యలింగం తెలిపారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం సిద్ధప్ప చిత్రపటంతో భక్తుల ఆధ్వర్యంలో వాడ వాడలా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి, ఆశ్రమం చేరుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. అనంతరం ఆంజనేయ స్వామి అభిషేకం, తులసిపూజ, గాయత్రి యజ్ఞం, సరస్వతి పూజ, సిద్ధప్ప సమాధి వద్ద సమారాధన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, భజనలు, ఆధ్యాత్మిక ఇష్టాగోష్ఠులు, ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. తదనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాణిక్యలింగం కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో సిద్ధప్ప కవి కళాతోరణం ఏర్పాటు చేయడంతోపాటు, తెలంగాణ తేజోమూర్తిగా గుర్తించబడ్డారు. తొమ్మిదవ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకాల్లో తన జీవితం, సాహిత్యం పాఠ్యాంశాలుగా కొనసాగడం సిద్ధప్పకు దక్కిన అపూర్వ గౌరవం.
శనిగరం జలాశయాన్ని ఆనుకొని, కొండలు, గుట్టలు, పచ్చదనం ఉట్టిపడే ఎత్తైన ప్రాంతంలో గల సిద్ధప్ప ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు నలభై గ్రంథాలు రచించిన సిద్ధప్ప గారి రచనల్లో సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని నాలుగు సంపుటాలు బహుళ ప్రజాదరణ పొందాయి. కాకిహంసో పాఖ్యానము, జీవనరేంద్ర డ్రామా, అశోక సామ్రాజ్యం యక్ష గానం, శివస్తుతి, విష్ణు భజనావళి, నీతి శాస్త్రం, వర్ణమాల కందార్థాలు, గోవ్యాగ్ర సంభాషణ, బిక్కనవోల్ కందార్థాలు, యాదగిరి భజనావళి వంటి గ్రంథాలను రచించారు. దాదాపు అన్ని పద్య ప్రక్రియలతో పాటు యక్షగానం, స్తోత్రాలు, వర్ణమాల, దండకాలు, సుభాషితాలు, హితబోధ, వేదాంత తత్వ కీర్తనలు, కాలజ్ఞానం, నక్షత్రమాల, నాటకాలు వంటి ఎన్నో రచనలు చేశారు.



