రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు మెదడు ఆరోగ్యానికి సంబంధించిన కీలక సంకేతాలను అందించవచ్చని తాజా పరిశోధన వెల్లడించింది. హిమోగ్లోబిన్ సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నా, అధికంగా ఉన్నా భవిష్యత్తులో డిమెన్షియా (చిత్తవైకల్యం) వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి, వాస్క్యులర్ డిమెన్షియా ముప్పుతో హిమోగ్లోబిన్ స్థాయిలకు సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో ప్రచురితమయ్యాయి. జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన యూరోపియన్ కాలేజ్ ఆఫ్ న్యూరోసైకోఫార్మకాలజీ (ఈసీఎన్పీ) సదస్సులోనూ వీటిని వెల్లడించారు. దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు 40 ఏళ్లు పైబడిన 3,16,542 మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించారు. 20042005లో నిర్వహించిన జాతీయ ఆరోగ్య పరీక్షల సమాచారాన్ని సేకరించారు. అనంతరం 2019 వరకు సుమారు 15 ఏళ్ల పాటు వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. పాల్గొన్నవారిని రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిల ఆధారంగా ఐదు వర్గాలుగా విభజించారు. ఈ క్రమంలో హిమోగ్లోబిన్ అత్యల్పంగా, అత్యధికంగా ఉన్నవారిలో డిమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. హిమోగ్లోబిన్ అత్యల్ప స్థాయిలో ఉన్నవారికి సాధారణ స్థాయి కలిగిన వారితో పోలిస్తే డిమెన్షియా వచ్చే ప్రమాదం 16 శాతం అధికంగా ఉంది. అత్యధిక హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్నవారిలో ఈ ముప్పు 7 శాతం పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది.
అధ్యయనంలో డిమెన్షియా రకాలను విడివిడిగా పరిశీలించారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారిలో అల్జీమర్స్ వచ్చే ప్రమాదం 14 శాతం అధికంగా ఉంది. వాస్క్యులర్ డిమెన్షియా విషయంలో, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారిలో 19 శాతం, అధికంగా ఉన్నవారిలో 18 శాతం ముప్పు పెరిగింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సంబంధం మరింత స్పష్టంగా కనిపించింది. వాస్క్యులర్ డిమెన్షియా అనేది మెదడుకు రక్తప్రసరణలో సమస్యల కారణంగా వచ్చే చిత్తవైకల్యం. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు దీనికి కారణమవుతాయి. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్తకణాల్లో ఉండే ప్రోటీన్. ఇది ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని వివిధ భాగాలకు, ముఖ్యంగా మెదడుకు, ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంగా ఈ పరిస్థితి కొనసాగితే మెదడులోని జ్ఞాపకశక్తికి సంబంధించిన భాగాలపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో హిమోగ్లోబిన్ అధికంగా ఉండటం వల్ల రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడం, రక్తనాళాల సమస్యలు, స్ట్రోక్ వంటి ప్రమాదాలతో సంబంధం కలిగి ఉండవచ్చు. అయితే ఈ కారణాలు డిమెన్షియాకు నేరుగా దారితీస్తాయని తాజా అధ్యయనం నిరూపించలేదు.
హిమోగ్లోబిన్ పరీక్ష సాధారణ రక్త పరీక్షల్లో భాగంగా నిర్వహిస్తారు. రక్తహీనతను గుర్తించేందుకు ఈ పరీక్ష ఇప్పటికే విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు హిమోగ్లోబిన్ స్థాయిలు భవిష్యత్తులో మెదడు ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాదాలను అంచనా వేయడంలోనూ ఉపయోగపడే అవకాశాలున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే హిమోగ్లోబిన్ స్థాయిలు మాత్రమే ఆధారంగా అల్జీమర్స్ లేదా డిమెన్షియా వచ్చే అవకాశాన్ని ఖచ్చితంగా చెప్పలేము. రక్తహీనత, మూత్రపిండాల సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, పోషకాహార లోపం వంటి అనేక అంశాలు హిమోగ్లోబిన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని ఐరన్ మాత్రలు తీసుకోవడం, అధికంగా ఉందని స్వయంగా చికిత్స ప్రారంభించడం సరైంది కాదు. హిమోగ్లోబిన్ స్థాయిల్లో మార్పులకు అసలు కారణాన్ని గుర్తించడం అవసరం. ఈ అధ్యయనం పరిశీలనాత్మక పరిశోధన కావడంతో హిమోగ్లోబిన్ స్థాయిలు నేరుగా డిమెన్షియాకు కారణమవుతాయని నిర్ధారించలేదు. భిన్న దేశాలు, జనాభా వర్గాల్లో మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.




