మండల వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు వివిధ శైవక్షేత్రాలకు చేరుకుని పరమశివుడిని దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి, ఉసిరి చెట్ల వద్ద దీపారాధనలు చేశారు. పలుచోట్ల ఆలయ ప్రాంగణాలు దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి.
ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం
మండలంలోని కొడవటూరు, బండనాగారం, బచ్చన్నపేటతో పాటు వివిధ గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి శివనామస్మరణ, భజనలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో గ్రామాలు మార్మోగాయి.



