జనగామ, 2026-11-23
విధుల్లో కఠినం.. మనసులో మంచితనం
జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం వడ్డెగూడెం గ్రామానికి చెందిన తాటికాయల భాస్కర్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు. వెన్నెముకకు తీవ్ర గాయాలవడంతో ఇకపై నడవలేని పరిస్థితి ఉంటుందని వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు (ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు) ఉన్నారు.
కుటుంబానికి ఆసరాగా నిలిచే కుటుంబ పెద్ద మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక, మానసిక ఇబ్బందులు మరింత పెరిగాయి.
ఈ విషయం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి రావడంతో, బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఆయన ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు, ఈరోజు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి వై. రవి కిరణ్, జఫర్గఢ్ తహసీల్దార్ శ్రీనివాస్ బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
కష్టాల్లో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ, వారికి మనోధైర్యం కల్పించడంతో పాటు, మానవీయ దృక్పథంతో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందనడానికి ఇది నిదర్శనం.


