మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ పోరిక బలరాంనాయక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఆయన తాజాగా స్పందించి వివరణ ఇచ్చారు. తన మాటలను కొందరు వక్రీకరించారని, తన ఉద్దేశం వేరని స్పష్టం చేశారు.
గూడూరు సభలో ఎంపీ వ్యాఖ్యలు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో రాజ్యసభ సభ్యుడు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ బలరాంనాయక్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. భర్తలు లేని మహిళలకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వృద్ధాప్య పింఛన్లు, రేషన్ బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందుతాయని పేర్కొన్నారు.
వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బలరాంనాయక్
తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఎంపీ వివరణ ఇచ్చారు. భర్తను కోల్పోయిన మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని గిరిజనులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పానని తెలిపారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు.
ఈ వ్యాఖ్యలతో మహిళా సంక్షేమ పథకాల ప్రస్తావన రాజకీయ చర్చకు దారితీసింది. ఎంపీ వివరణతో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.


