నర్మెట్ట, 9 September
తెలంగాణ భాష, యాస, సంస్కృతికి విశేష సేవలందించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భాషా క్రీడల్లో పాల్గొని, కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు తెలంగాణ భాష, యాస, సంస్కృతికి విశేష సేవలందించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని జడ్పీహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం నీలం వేణు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు భాషామతల్లికి పద్య తోరణాన్ని సమర్పించారు. అనంతరం కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం నీలం వేణు మాట్లాడుతూ.. తన రచనలు, మాట తూటాలతో నిజాం నవాబును ఎదిరించడమే కాకుండా, తెలంగాణ భాష, యాస కోసం జీవితాంతం తపించిన కాళోజీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. మాతృభాషపై అభిమానం పెంపొందించుకోవడంతో పాటు తెలంగాణ భాషా వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జయంతి సందర్భంగా విద్యార్థులకు అంత్యాక్షరి, అచ్చతెలుగులో మాట్లాడటం తదితర భాషా క్రీడలను నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు పద్మతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.







