ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ నాయకులకు ప్రభుత్వ పదవులను ఓదార్పు బహుమతిగా ఇవ్వలేరని కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ విధేయతకు ప్రతిఫలంగా ప్రభుత్వ పదవులను కట్టబెట్టడం కుదరదని స్పష్టం చేసింది. ప్రజా పదవులు ప్రజాసేవ కోసం మాత్రమే ఉండాలని, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని పేర్కొంది.
గురురాజ్ గాంటిహోళే వర్సెస్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేసులో విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటు చేసిన అదనపు కమిటీ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ డీకే సింగ్, జస్టిస్ హెచ్. శాంతిభూషణ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది.
ఎన్నికల్లో ఓడిన వ్యక్తికి కమిటీ ఛైర్మన్ పదవి
బైందూర్ ఎమ్మెల్యే గురురాజ్ గాంటిహోళే 2022లో నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కమిటీ ఛైర్మన్గా నియమితులయ్యారు. అయితే అదే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మరో అదనపు కమిటీని ఏర్పాటు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గురురాజ్ గాంటిహోళేపై ఓడిపోయిన ప్రత్యర్థికి ఈ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో 12,313 దరఖాస్తులను గురురాజ్ కమిటీకి, 23,983 దరఖాస్తులను అదనపు కమిటీకి కేటాయించారు. ఈ అదనపు కమిటీ ఏర్పాటును గురురాజ్ గాంటిహోళే హైకోర్టులో సవాలు చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం చేయొద్దు
కర్ణాటక భూ రెవెన్యూ చట్టం-1964లోని సెక్షన్ 94-(2-) ప్రకారం అదనపు కమిటీ ఏర్పాటుకు అవసరమైన పరిపాలనా కారణాలు ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే స్పష్టంగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది. నిర్ణయం తీసుకున్న మూడేళ్ల తర్వాత దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా అప్పటి నిర్ణయాన్ని సమర్థించలేరని ధర్మాసనం తెలిపింది.
ఎన్నికల్లో సాధించలేని అధికారాన్ని పరోక్ష మార్గాల్లో పొందేందుకు ప్రయత్నించినట్లు రికార్డులు సూచిస్తున్నాయని వ్యాఖ్యానించింది. వ్యక్తిగత అభ్యర్థనలు, రాజకీయ ప్రభావం లేదా నాయకుడిని తిరిగి రాజకీయంగా నిలబెట్టాలనే ఉద్దేశం అదనపు పదవి కల్పించడానికి సరైన కారణాలు కావని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారాన్ని ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాలి తప్ప, వ్యక్తిగత ఆకాంక్షలు, రాజకీయ ప్రయోజనాల కోసం కాదని ధర్మాసనం పేర్కొంది.
ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
అదనపు కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. అయితే, కమిటీ ఛైర్మన్ నియామకానికి సంబంధించిన నిబంధన 108-ను మాత్రం కొట్టివేయలేదు. కమిటీ ఛైర్మన్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. పరిపాలనా సామర్థ్యం, అనుభవం, నిజాయితీ, నిష్పక్షపాత ప్రవర్తన వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని హైకోర్టు సూచించింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.
ఈ తీర్పు ద్వారా ప్రభుత్వ పదవుల నియామకాల్లో రాజకీయ జోక్యం, వ్యక్తిగత ప్రయోజనాలకు తావు ఉండకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చింది.


