అండమాన్ నికోబార్ దీవుల్లో జైళ్ల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం 2026లో కొత్త జైళ్ల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది. బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను రద్దు చేసి, ఆధునిక భద్రత, ఖైదీల పునరావాసానికి ఈ చట్టం ప్రాధాన్యత ఇవ్వనుంది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ కొత్త నిబంధనలు, బ్రిటిష్ కాలం నాటి 1894 నాటి జైళ్ల చట్టం, 1900 నాటి ఖైదీల చట్టం, 1950 నాటి ఖైదీల బదిలీ చట్టాలను భర్తీ చేయనున్నాయి. ఈ చట్టం అమలుతో జైళ్ల నిర్వహణలో సమూల మార్పులు రానున్నాయి. కొత్త చట్టం ప్రకారం, ఖైదీలకు కేవలం శిక్ష విధించడమే కాకుండా, వారి పునరావాసం, విద్య, వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు. జైళ్లలో ఓపెన్, సెమీ ఓపెన్ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వ్యవస్థలు, మొబైల్ జామర్లు వంటి ఆధునిక భద్రతా సాంకేతికతను ప్రవేశపెట్టనున్నారు. మహిళలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగ ఖైదీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పాటు, జైళ్లలో కుల వివక్షను పూర్తిగా నిషేధించనున్నారు. అంతేకాకుండా, ఆరేళ్లలోపు పిల్లలను తమ తల్లులతో పాటు జైలులో ఉండేందుకు అనుమతిస్తూ, వారి ఆరోగ్య సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేయనుంది. ఈ సంస్కరణలు అండమాన్‌లోని చారిత్రక సెల్యులార్ జైలు (కాలాపానీ) నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ చట్టం ద్వారా జైళ్లలో మానవతా దృక్పథంతో పాటు భద్రతను కూడా పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.






