ఢిల్లీ-మీరట్ మధ్య ప్రయాణించే వారికి జాతీయ రాజధాని ప్రాంత రవాణా సంస్థ () శుభవార్త అందించింది. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు, సోమవారం నుంచి అదనంగా ఎనిమిది పరిమిత స్టాప్‌లతో కూడిన ఫాస్ట్ నమో భారత్ రైళ్లను ప్రారంభించనుంది. ఈ సేవలు ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో అందుబాటులో ఉంటాయి.
కొత్త ఫాస్ట్ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఆనంద్ విహార్ నుంచి ఘజియాబాద్‌కు కేవలం 8 నిమిషాలు, ఘజియాబాద్ నుంచి బేగంపుల్కు 28 నిమిషాలు, ఆనంద్ విహార్ నుంచి బేగంపుల్కు 36 నిమిషాలు పడుతుంది. మొత్తం 82 కిలోమీటర్ల కారిడార్‌ను 50 నిమిషాల్లోపే పూర్తి చేయవచ్చు.
ఐదు ప్రధాన స్టేషన్లలోనే ఆగనున్న ఫాస్ట్ రైళ్లు
సాధారణ నమో భారత్ రైళ్లు కారిడార్‌లోని అన్ని స్టేషన్లలో ఆగుతాయి. అయితే, కొత్త ఫాస్ట్ రైళ్లు కేవలం ఐదు ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఆగనున్నాయి. అవి: సరాయ్ కాలే ఖాన్, ఆనంద్ విహార్, ఘజియాబాద్, బేగంపుల్, మోదీపురం.
ప్రత్యేక సర్వీసుల వేళలు
ఉదయం రెండు దిశల్లోనూ 8 గంటలకు, 8:30 గంటలకు ఫాస్ట్ రైళ్లు బయలుదేరుతాయి. సాయంత్రం 6 గంటలకు, 6:30 గంటలకు అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్న సాధారణ నమో భారత్ రైళ్లు కూడా యథావిధిగా కొనసాగుతాయి. అవి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఢిల్లీ-మీరట్ కారిడార్‌లో ప్రస్తుతం రోజుకు సుమారు 1.1 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు ఈ మార్గంలో ఐదు కోట్లకు పైగా ప్రయాణాలు నమోదయ్యాయి. కొత్త ఫాస్ట్ సర్వీసులతో ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రోడ్లపై ట్రాఫిక్, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికీ ఉపయోగపడుతుందని భావిస్తోంది.

