దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో కనీసం ఒక ప్రామాణిక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర విద్యాశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. దీనివల్ల విద్యార్థుల దూర ప్రయాణాల కష్టాలు తగ్గుతాయి.
ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు దూరంగా ఉండటంతో విద్యార్థులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సమస్యను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల నెట్వర్క్ను విస్తరించాలని నిర్ణయించారు.
పరీక్షా కేంద్రాల ఏర్పాటు
ఈ ప్రణాళికలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (), పేపర్ ఆధారిత పరీక్షలకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల సమయంలో అనుకోని అంతరాయాలు ఎదురైతే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా సమీపంలో ప్రత్యామ్నాయ కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు.
పారదర్శకతకు చర్యలు
ఇదే సమయంలో పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ () ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మాజీ సైనికులు, పారామిలిటరీ సిబ్బందితో కూడిన స్వతంత్ర పరిశీలకుల బృందాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
నీట్-యూజీపై పరిశీలన
నీట్-యూజీ పరీక్షను కూడా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఈ ప్రణాళిక అమలైతే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు రాయడం మరింత సులభం కానుంది.

