సిద్దిపేట (అర్బన్), 2026-11-24
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధోన్మాదాన్ని అరికట్టి, ప్రపంచ శాంతిని కాపాడేందుకు వామపక్ష, ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్ఓ) తెలంగాణ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆకలి లేని సమాజ నిర్మాణం, కులమత వివక్ష లేని సమాజ స్థాపన కోసం ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధోన్మాదాన్ని అరికట్టి, ప్రపంచ శాంతిని కాపాడేందుకు వామపక్ష, ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్ఓ) తెలంగాణ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆకలి లేని సమాజ నిర్మాణం, కులమత వివక్ష లేని సమాజ స్థాపన కోసం ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని ఆయన అన్నారు.
మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఏఐపీఎస్ఓ సిద్దిపేట జిల్లా మూడవ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కేవీఎల్ మాట్లాడుతూ సామ్రాజ్యవాద శక్తులు తమ ఆధిపత్యం కోసం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రోత్సహిస్తూ మానవాళి మనుగడకు ముప్పు తెస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాల కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారని పేర్కొన్నారు. ఆయుధాల తయారీ, యుద్ధాల కోసం ఖర్చు చేస్తున్న అపారమైన సంపదను ప్రజల సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి రంగాలకు వినియోగించాలని సూచించారు.
ప్రపంచ శాంతి అంటే కేవలం యుద్ధాలు లేని పరిస్థితి మాత్రమే కాదని, ఆకలి, పేదరికం, అసమానతలు, కుల, మత, జాతి వివక్ష లేని సమాజ నిర్మాణంతోనే నిజమైన శాంతి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛలు, లౌకిక విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడటంలో వామపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు, శాంతికాముకులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉద్యమాలను బలోపేతం చేస్తూ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాలని కోరారు.
ఏఐపీఎస్ఓ నూతన జిల్లా కమిటీ ఎన్నిక
మహాసభల అనంతరం ఏఐపీఎస్ఓ సిద్దిపేట జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షవర్గ సభ్యులుగా గజాభిమకర్ బన్సీలాల్, టీ. యాదగిరిని, జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శులుగా జాలిగామ శిరీష, రామగళ్ల నరేశ్‌ను ఎన్నుకున్నారు.
జిల్లా ఉపాధ్యక్షులుగా పిట్ల మల్లేశం, జేరిపోతుల జనార్దన్, అనిల్, అనిరుధ్, సహాయ కార్యదర్శులుగా రజిని, రంజిత్, మాచర్ల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఆంజనేయులు, యుగంధర్, అంతయ్య, యాదగిరి, పంపరి నగేష్‌లను ఎంపిక చేశారు.
ఈ మహాసభలో సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డితో పాటు వివిధ ప్రజా సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


