రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా, చివరకు క్షమాపణలు చెప్పారు.
రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా, చివరకు క్షమాపణలు చెప్పారు. రైతులు ఏడాదిలో కేవలం మూడు నెలలే కష్టపడి పనిచేస్తారని, మిగిలిన తొమ్మిది నెలలు పేకాట ఆడుతూ, గుట్కా, మద్యం సేవిస్తూ గడుపుతారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
మధ్యప్రదేశ్‌లోని జిల్లాలో సోమవారం నిర్వహించిన గోవర్ధన్ పూజ కార్యక్రమంలో జనార్దన్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రైతు సంఘాలు, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు.
రైతులు ఏడాది పొడవునా విత్తనాలు వేయడం, సాగునీటి నిర్వహణ, కలుపు తీయడం, పంటల సంరక్షణ, కోత వంటి పనుల్లో నిమగ్నమై ఉంటారని రైతు సంఘాల నాయకులు గుర్తుచేశారు. ఎంపీ వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొందరు రైతులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం జనార్దన్ మిశ్రా క్షమాపణ వీడియో విడుదల చేశారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని, రైతుల కష్టాలు తనకు తెలుసని పేర్కొన్నారు. తన మాటల వల్ల రైతుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు. రైతులను అవమానించే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు.
అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.





