హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రైవేటు స్కూల్ బస్సుకు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ సంఘటనలో బస్సు క్లీనర్‌తో పాటు ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై ముల్కనూరు అంబేద్కర్ కూడలి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్కతుర్తి మండలం ఇందిరా నగర్ గ్రామంలోని ఒక కార్పోరేట్ స్కూలుకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకువస్తుండగా, కూడలి వద్ద మలుపు తిప్పుతుండగా హనుమకొండ వైపు వస్తున్న లారీ బస్సును స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు ముందు భాగం దెబ్బతింది.
ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం రావడంతో బస్సులోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని, పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదంలో బస్సు క్లీనర్, ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారని స్థానికులు వెల్లడించారు.
ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి మధ్యలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ఆరోపించారు. వాహనదారులు రోడ్డు నియమాలను పాటిస్తున్నా, అడ్డంకులు తొలగించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఇకనైనా అధికారులు స్పందించి విగ్రహాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
సంఘటనా స్థలాన్ని ముల్కనూరు ఎస్సై రాజు పరిశీలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






