సిద్దిపేట (అర్బన్), 2026-11-20
సిద్దిపేటలో ఈనెల 25న జరగనున్న మహా పాదయాత్రలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు.
ఈనెల 25న సిద్దిపేట పట్టణంలో నిర్వహించనున్న మహా పాదయాత్రలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొననున్న నేపథ్యంలో, పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు.
శుక్రవారం సిద్దిపేటలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహా పాదయాత్ర నిర్వహణకు చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, నాయకులు, కార్యకర్తల సమీకరణ, ప్రజల భాగస్వామ్యం, కార్యక్రమ నిర్వహణలో వివిధ విభాగాల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
పాదయాత్ర విజయవంతానికి అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర మంత్రి పాల్గొనే ఈ మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ప్రారంభమై అంబేద్కర్ సర్కిల్ వరకు మహా పాదయాత్ర కొనసాగుతుందని ఎంపీ తెలిపారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై ఇండియా కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్, కప్పర ప్రసాద్, వంగ రామచంద్రారెడ్డి, విద్యాసాగర్, దూది శ్రీకాంత్ రెడ్డి, అంబటి బాలేష్ గౌడ్, మోహన్ రెడ్డి, కనకయ్య, చింత సంతోష్, విభీషణ్ రెడ్డి, గుండ్ల జనార్ధన్, బాసంగారి వెంకట్, కాసనిగొట్టు సంతోష్, ఉమారెడ్డితో పాటు జిల్లా, మండల స్థాయి బాధ్యులు పాల్గొన్నారు.


