సిద్దిపేట (అర్బన్), 2026-11-20
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనతో బీఆర్ఎస్ నాయకుల్లో వణుకు మొదలైందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనతో బీఆర్ఎస్ నాయకుల్లో వణుకు మొదలైందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. ముఖ్యమంత్రి సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులకు నిజాయితీ ఉంటే సిద్దిపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అబద్ధాలతో ప్రజలను ఎన్నాళ్లు మభ్యపెడతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో వాస్తవాలు మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదని అన్నారు. సిద్దిపేట బీఆర్ఎస్ నాయకుల సొంత ఆస్తి కాదని, అధికారం కోల్పోయినా వారి అహంకారం తగ్గలేదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని అత్తు ఇమామ్ సవాల్ విసిరారు. ప్రజలను మరోసారి అబద్ధాలతో మోసం చేయాలని చూస్తున్న బీఆర్ఎస్ నాయకుల ఆటలు ఇకపై సాగనివ్వబోమని అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మాజీ మంత్రి కీ.శే. అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి ప్రకటించడం అభినందనీయమని తెలిపారు. దివంగత నాయకుడి సేవలను గుర్తించి ఆయన పేరును మెడికల్ కళాశాలకు పెట్టడం సిద్దిపేటకు గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని అత్తు ఇమామ్ అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు చేసే విమర్శలను కాంగ్రెస్ శ్రేణులు ధీటుగా తిప్పికొడతాయని అన్నారు. సిద్దిపేటలో ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ విజయవంతం కావడానికి సహకరించిన జిల్లా అధికారులు, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో గ్యాదారి మధు, గయాజుద్దీన్, అర్షద్ హుస్సేన్, విజయ్, డానియల్, నజ్జు, ముద్దు తదితరులు పాల్గొన్నారు.


