టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్, పెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు వర్తించే నిబంధనలపై ఆర్బీఐని వివరణ కోరింది. అయితే, సెప్టెంబర్‌లో టాటా సన్స్ డీరిజిస్ట్రేషన్ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. తాజాగా అందించిన సమాచారంలో నిబంధనలను, ముఖ్యంగా లిస్టింగ్ అవసరాన్ని పాటించాలని సూచించింది.
టాటా గ్రూప్‌లో ఏయే కంపెనీలున్నాయి
టాటా సన్స్ ఆధీనంలో టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. టాటా సన్స్ మాత్రం వందేళ్లకు పైగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకుండా ప్రైవేట్ సంస్థగానే కొనసాగుతోంది.
టాటా ట్రస్ట్స్ అభిప్రాయం ఏమిటి
టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్, లిస్టింగ్ నిబంధన నుంచి తప్పించుకునేందుకు సంస్థ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు సమాచారం. మరోవైపు సంస్థ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తిరిగి నియామకం, లిస్టింగ్ నిర్ణయం వంటి అంశాలపై ట్రస్ట్స్‌కు, టాటా సన్స్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
అయితే, తాజా ఆర్బీఐ లేఖతో టాటా సన్స్ వెంటనే ఐపీఓకు వస్తుందని చెప్పలేం. కానీ లిస్టింగ్ అంశంపై నియంత్రణ సంస్థ ఒత్తిడి పెరుగుతున్నట్లు ఈ పరిణామం సూచిస్తోంది.






