హుస్నాబాద్, 2026-11-20
కోహెడలో అలింకో సహకారంతో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల నిర్ధరణ శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో అలింకో సంస్థ సహకారంతో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు అందించేందుకు ఏర్పాటు చేసిన నిర్ధరణ శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని, అదే రోజు రూ.4.75 లక్షల విలువైన నూతన చేయూత పింఛన్ల నగదు అర్హులైన పేదల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా సహాయ ఉపకరణాలను అందించేందుకే ఈ నిర్ధరణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాళ్లు, చేతులు లేని వారికి కృత్రిమ కాళ్లు, చేతులు, వినికిడి లోపం ఉన్నవారికి వినికిడి పరికరాలు, ఇతర అవసరమైన సహాయ ఉపకరణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం తంగళ్లపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా నమోదు ప్రక్రియను కూడా మంత్రి పొన్నం ప్రారంభించారు.



