నర్మెట్ట, 2026-08-20
రైతులకు నిబంధనల ప్రకారం యూరియా, ఎరువులు విక్రయించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం ఆయన నర్మెట మండలంలో ఆకస్మిక పర్యటన చేపట్టి, పలు గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గోదాంలను తనిఖీ చేశారు.
రైతులకు నిబంధనల ప్రకారం యూరియా, ఎరువులు విక్రయించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం ఆయన నర్మెట మండలంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
మండలంలోని గుంటూరుపల్లి గ్రామంలో రైతు వెలంగీణిరెడ్డి సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటను కలెక్టర్ ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం నర్మెట, ఇష్ఫలగడ్డ గ్రామాల్లోని కంది, మిర్చి, కూరగాయల పంటలను కూడా ఆయన పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పలగడ్డ గ్రామంలోని గోదాం, అంగన్వాడీ కేంద్రాలను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలు, వసతుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో తగినంత వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం పక్కనే రేకులు కూలిపోయి ఉన్న గదిని గమనించి, వెంటనే మరమ్మతులు చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
గోదాంలలో నిల్వలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. రైతు అగ్రోస్ కేంద్రంలో ఎరువుల రికార్డులు, స్టాక్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉన్న ఎరువుల స్టాక్ వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో కలెక్టర్‌తో పాటు డీఏవో అంబికా సోని, ఏవో మమత, సర్పంచులు చెన్నపురెడ్డి, ఉపసర్పంచ్ సురేష్, దరావత్ రాజుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

