మండు వేసవిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. రానున్న ఆరు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు కొనసాగవచ్చని తెలిపారు.
వాతావరణశాఖ అధికారుల ప్రకారం, నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమై, మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని చోట్లకు విస్తరించే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల 10 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతుందని తెలిపారు. ఇప్పటికే ఆదివారం ఉదయం నుంచే తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడటంతో పాటు హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
ఈసారి తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే భానుడి ప్రతాపం మొదలైంది. మార్చి మొదటి నాటికి చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు.
ప్రస్తుతం వాతావరణశాఖ వెల్లడించిన ప్రకారం, రానున్న 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలియడంతో ప్రజలకు కొంత ఊరట లభించింది. ఈ వర్షాలు వేసవి తాపాన్ని తగ్గించి, ప్రజలకు ఉపశమనాన్ని అందిస్తాయని భావిస్తున్నారు.


