ఘన్పూర్, 2026-11-25
అయినా పూర్ మండలంలోని కొన్ని గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, అనుయాయులతో కలిసి ఆర్భాటంగా మార్కెట్ ప్రారంభించి 20 రోజులు గడిచినప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా మంగళవారం సిపిఎం అయినా పూర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అయినా పూర్ ఎల్లమ్మ గుడి వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల నాయకులు తేలు ఇస్తారీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రకటించిందని తెలిపారు. ఆ సందర్భంలోనే చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి అనుయాయులతో ఆర్భాటంగా మార్కెట్లను ప్రారంభించి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని, రైతుల వద్ద ప్రతి వడ్ల గింజ కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పిందని, నేటికీ 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు రైతుల వద్ద ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆయన మండిపడ్డారు. రైతులు ఎండల ప్రభావంతో, అడపాదడపా వస్తున్న కరెంటుతో అహర్నిశలు కష్టపడ్డారు. అనేక పెట్టుబడులు పెట్టి, వడ్లు అమ్ముకొని అప్పులు తీర్చుకుందామని చూస్తుంటే, సకాలంలో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు కారుచౌకగా వడ్లను కొనుగోలు చేస్తున్నారు.
ప్రైవేటు వ్యక్తులు వడ్ల కటింగ్, క్యాష్ కటింగ్ పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడాన్ని ఆసరా చేసుకుని కొత్త వ్యాపారస్తులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. వారు చివరికి రైతులకు డబ్బులు ఇస్తారో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ నిర్వాహకులే ప్రైవేటు వ్యాపారస్తులతో కుమ్మక్కై, ప్రభుత్వ మార్కెట్లో వడ్లు అమ్మితే ఎంత కటింగ్ అవుతుందో చెప్పలేమని, తమను ఏమీ అడగవద్దని రైతులతో మాట్లాడడంతో రైతులు భయాందోళనలో ఉన్నారు. సంబంధిత అధికారులు వెంటనే కొనుగోలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో రైతులను ఏకం చేసి, పెద్ద ఎత్తున వడ్ల కొనుగోలు ప్రారంభమయ్యేంతవరకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఉల్లంపెల్లి సాయిలు, రైతు సంఘం నాయకులు కాగిత ఆగం రెడ్డి, మల్ల అంజయ్య, కానుగుల రాజు, సున్నం యాదగిరి, రాచకొండ నాగయ్య, పాశం చంద్రయ్య, నవీన్, దయ్యాల అనిల్, రుద్రమైన మణికంఠ, వరప్రసాద్, నరసింహారెడ్డి, అకేం కనకయ్య, రుద్రాలపు యాదయ్య, నర్సింలు, మల్లం చంద్రం, తేలు రాములు తదితరులు పాల్గొన్నారు. పోలీసులు వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు.





