వరంగల్, 29 October
150 యూనిట్ల సేకరణ
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ మార్గదర్శకత్వంలో మామునూరు సబ్ డివిజన్ పోలీసులు, ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల సహకారంతో బొల్లికుంట వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వరంగల్ తూర్పు జోన్ డీసీపీ అంకిత్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. రక్తదానం ప్రాణాలను కాపాడే గొప్ప మానవతా సేవ అని, అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి సహాయం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. రక్తదాతలకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆధ్వర్యంలో పండ్లు, పండ్ల రసాలు, అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మామునూరు ఏసీపీ ఎన్. వెంకటేష్, ఎంజీఎం ఆసుపత్రి వైద్య బృందం, వాగ్దేవి కళాశాల ఫార్మ్-డి ప్రిన్సిపాల్ కమల్ యాదవ్, మామునూరు సిఐ శ్రీనివాస్ యాదవ్, ఏనుమాముల, గీసుకొండ సీఐలు, సంగెం పర్వతగిరి, ఏనుమాముల, మామునూరు ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.












