ప్రజాధరణ సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో మహిళలు, పిల్లల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి.
99 రోజుల "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక"లో భాగంగా "చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ – సే నో టు డ్రగ్స్ వీక్" ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. జనగాం డిసిపి రాజమహేంద్ర నాయక్, జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డిసిపి రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ, పిల్లలు జీవితంలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, కష్టపడి చదవాలని సూచించారు. మత్తు పదార్థాల ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ, తెలియని వ్యక్తుల నుండి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోరాదని తెలిపారు. మాదకద్రవ్యాల విక్రయాల సమాచారాన్ని 100, 1098, 1908 నంబర్లకు అందించాలని కోరారు.
జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక సమస్యలను వివరించారు. పిల్లలు మంచి అలవాట్లతో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమం అనంతరం, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లోని పిల్లలకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. క్రీడల ప్రాముఖ్యతను అధికారులు నొక్కి చెప్పారు.








