హైదరాబాద్, 2026-11-21
నిరుద్యోగులను మోసం చేసిన కొలుగూరి రవికిరణ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేరును దుర్వినియోగం చేసి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొలుగూరి రవికిరణ్ అనే వ్యక్తి మంత్రి ఓఎస్డీగా నకిలీ అవతారం ఎత్తి, నకిలీ ఐడీ కార్డులు, ప్రభుత్వ నియామక ఉత్తర్వులను సృష్టించి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారంపై పరిశ్రమల శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వెబ్సైట్లను పోలిన నకిలీ పోర్టల్స్ సృష్టించి, వాటి ద్వారా అభ్యర్థులను నమ్మించి మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. టీచర్, మున్సిపల్ అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.
నలుగురు బాధితుల నుంచి రూ.50.87 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో వెల్లడైంది. బాధితులు మంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ వెబ్సైట్లు, డిజిటల్ ఆధారాలు, బ్యాంకు లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు చేయాలని బాధితులు కోరారు.
ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కొలుగూరి రవికిరణ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ ఐడీ కార్డులు, నియామక ఉత్తర్వులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మోసంలో ఇంకా ఎవరైనా భాగస్వాములు ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.



