మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పై జరిగిన దాడి ఘటనపై జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హన్మకొండలోని వినయ్ భాస్కర్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఘటనకు దారితీసిన పరిస్థితులు, పోలీసుల వ్యవహారశైలిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధిపై దాడి చేయడం దారుణమని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే నాయకులపై పోలీసులతో దాడులు చేయించడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని పల్లా పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రశ్నించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని, ప్రశ్నించే గొంతులను అణచివేయడం సాధ్యం కాదని పల్లా స్పష్టం చేశారు. పోలీసుల అత్యుత్సాహాన్ని అరికట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్రెడ్డి, ముస్త్యాల కిష్టయ్య, చెర్యాల మాజీ మార్కెట్ డైరెక్టర్ వంగ రామరాజు, జిల్లా నాయకులు పెద్ది రాజిరెడ్డి, మంద యాదగిరి, బైరగోని యాదగిరి, ఏడెల్లి శ్రీనివాస్‌రెడ్డి, తాళ్లపల్లి రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.











