చిన్నారుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని ఐసీడీఎస్ అధికారులు సూచించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం పోషణ మాసం, ప్రారంభ బాల్య సంరక్షణ విద్య (ఈసీసీఈ డే) దినోత్సవాన్ని నిర్వహించారు.
1వ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఏసీడీపీఓ హరిత, అంగన్వాడీ టీచర్ తోట పద్మ ఆధ్వర్యంలో పోషణ మాసం అవగాహనా కార్యక్రమం జరిగింది. అందుబాటులో లభించే ఆకుకూరలు, కూరగాయలను నిత్య ఆహారంలో భాగంగా చేసుకోవాలని, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే పప్పు దినుసులు, చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని అధికారులు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే బాలామృతంతో వివిధ రకాల పోషకాహార వంటకాలను తయారు చేసి పిల్లలకు అందించాలని, గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పోషకాహార ప్రదర్శన నిర్వహించి, పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించారు. మండల కేంద్రంలోని పూర్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ-4, 6 కేంద్రాల్లో ఈసీసీఈ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల సంరక్షణ, ప్రాథమిక విద్య, ఆరోగ్యం, పోషణతో పాటు శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ వికాసంపై అవగాహన కల్పించారు. ఆటలు, పాటలు, కథలు, వివిధ అభ్యాస కార్యక్రమాలు నిర్వహించి వారిలో సృజనాత్మకతను పెంపొందించారు.
బాల్యదశలో అందించే సంరక్షణ, విద్య పిల్లల భవిష్యత్‌కు కీలకమని అంగన్వాడీ టీచర్లు సుద్దాల లక్ష్మి, రాజమల్లవ్వ తెలిపారు. వయస్సుకు తగిన పౌష్టికాహారం, పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యంపై చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే చిన్నారుల్లో మంచి అభ్యాస నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందుతాయని తెలిపారు. కార్యక్రమాల్లో ఏసీడీపీఓ హరిత, సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్లు తోట పద్మ, సుద్దాల లక్ష్మి, రాజమల్లవ్వ, ఆయా లక్ష్మి, తల్లులు, ఆశా కార్యకర్తలు, చిన్నారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.












