బీఆర్ఎస్ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు.. కాంగ్రెస్ పాలనలో 12 వేలేనని విమర్శ
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకగా పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గత ఓటర్ల జాబితాను ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అందించామని, ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున, ప్రతి గ్రామానికి ఒకరు లేదా ఇద్దరు ఇన్ఛార్జీలను నియమించాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి పది వార్డులకు ఒకరి చొప్పున బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, వైద్యులు, న్యాయవాదులు తదితర పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ప్రత్యేకంగా సమన్వయం చేసుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ఆన్లైన్లో నాలుగు దశల్లోనే పూర్తవుతుందని, డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికెట్, చిరునామా ఆధారం, ఫొటో తదితర వివరాలను అప్లోడ్ చేయాలని తెలిపారు. 2021 నాటికి మూడేళ్లు పూర్తయ్యేలా డిగ్రీ, ఓపెన్ డిగ్రీ, డిప్లొమా లేదా పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు అర్హులని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని పల్లా తెలిపారు. పోలీస్ శాఖలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతోపాటు విద్యుత్ శాఖలో 20 వేలకు పైగా ఉద్యోగులను పర్మనెంట్ చేశామని, సింగరేణిలో 14 వేల మందికి, ఆర్టీసీలో సుమారు 15 వేల మంది సిబ్బందిని పర్మనెంట్ చేశామని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితర పోస్టులను కూడా భర్తీ చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పాత నోటిఫికేషన్లనే కొనసాగిస్తోందని విమర్శించారు. మెగా డీఎస్సీ పేరుతో పాత నోటిఫికేషన్‌నే మార్చి ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటివరకు కేవలం 12 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిందన్నారు. 46, 29 సమస్యలపై ఉద్యోగార్థుల తరఫున బీఆర్ఎస్ కోర్టుల వరకు వెళ్లి పోరాడిందని తెలిపారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి కేవలం 46 పోస్టులకు మాత్రమే అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలకు కూడా నిధులు కేటాయించలేదన్నారు. గత మూడేళ్లుగా విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ జరగలేదని తెలిపారు.
రైతులు విద్యుత్, సాగునీరు, ఎరువులు, యూరియా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పల్లా అన్నారు. రైతుబంధు, రైతుభీమా సక్రమంగా అందక రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘం గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ నాయకులు పదవులు, ఇళ్లు, ప్లాట్ల పేరుతో కార్మికులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు ఎలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడంతోపాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గులాబీ జెండాతో, బీఆర్ఎస్ ఓట్లతో గెలిచిన వారు అదే పార్టీకి చెందిన సర్పంచులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పల్లా అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎలాంటి ఒత్తిళ్లకు భయపడవద్దని, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు నుంచి ఎన్నికల వరకు పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.











