నాలుగేళ్లుగా ఒక్క టీబీ కేసు నమోదు కాకపోవడంతో కేంద్రం నుంచి గుర్తింపు
తరిగొప్పుల, అక్టోబర్ 08.క్షయవ్యాధి నిర్మూలనలో మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామం విశేష గుర్తింపు పొందింది. గత నాలుగేళ్లుగా గ్రామంలో ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాకపోవడంతో గ్రామ సర్పంచ్ కావట్టి సుధాకర్‌కు ప్రశంసాపత్రం లభించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో ఈ గుర్తింపు లభించింది. గ్రామంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ టీబీ నిర్మూలనకు కృషి చేస్తున్న సర్పంచ్ కావట్టి సుధాకర్‌ను అభినందిస్తూ జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామాన్ని టీబీ రహితంగా ఉంచేందుకు సహకరిస్తున్న అబ్దుల్ నాగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని అభినందించారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.












