కరీంనగర్ జిల్లా మండలం రేకొండ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా వేపచెట్టును తొలగించిన ఘటనపై ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. అనుమతులు, ముందస్తు సమాచారం లేకుండా చెట్టును తొలగించినట్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు శనివారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ) అన్వర్ హుస్సేన్ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా చెట్టు తొలగింపునకు సంబంధించిన వివరాలను పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామాల్లోని చెట్లను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
తొలగించిన వేపచెట్టు పరిమాణం, కొలతలను పరిగణనలోకి తీసుకొని వాల్టా చట్టం ప్రకారం రూ.1,899 జరిమానా విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం జరిమానా మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలోనే చెట్టు తొలగింపు జరగడం, దీనిపై ఫిర్యాదు అందడంతో ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.












