రఘునాథపల్లి, 2026-11-23
ప్రతి తండా గ్రామపంచాయతీకి ఏటా రూ.25 లక్షల ప్రత్యేక నిధులు, నూతన గ్రామపంచాయతీల్లో హెల్త్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గిరిజన తండాలు, గ్రామపంచాయతీల అభివృద్ధికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి () జనగామ జిల్లా అధ్యక్షులు కొర్ర రాజేందర్ నాయక్ కోరారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఆయన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో గిరిజన తండాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఆచరణలో పెట్టాలని కోరారు. ప్రధానంగా ఈ కింది డిమాండ్లను వినతిపత్రంలో పేర్కొన్నారు.
ప్రతి గిరిజన తండా గ్రామపంచాయతీకి ఏటా రూ.25 లక్షల ప్రత్యేక నిధులు కేటాయించాలి. గిరిజన తండాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి హద్దులు నిర్ణయించాలి. గిరిజన తండాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మౌలిక వసతులు కల్పించాలి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలి. గ్రామపంచాయతీలకు రావాల్సిన పెండింగ్ నిధులు, అభివృద్ధి పనుల బిల్లులు వెంటనే విడుదల చేయాలి.
ప్రతి నూతన గిరిజన గ్రామపంచాయతీలో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ప్రతి హెల్త్ సబ్ సెంటర్కు ఏఎన్ఎంలను నియమించడంతో పాటు అవసరమైన వైద్య సిబ్బందిని కూడా నియమించాలి. హెల్త్ సబ్ సెంటర్లకు భవనం, మందులు, వైద్య పరికరాలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ప్రస్తుతం అనేక గిరిజన తండాల ప్రజలు చిన్నపాటి అనారోగ్య సమస్యలకు సైతం ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, దీనివల్ల ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి నూతన గిరిజన గ్రామపంచాయతీలో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేసి, ఏఎన్ఎం, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచితే ప్రజలకు గ్రామస్థాయిలోనే ప్రాథమిక వైద్య సేవలు అందుతాయని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, గిరిజన తండాలు మరియు నూతన గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.







